Friday, March 25, 2016

తగ్గినా... ఆకర్షణీయమే!



 
పెట్టుబడి సురక్షితం.. రాబడికి హామీ.. అని చెప్పగానే వెంటనే స్ఫురించేవి జాతీయ పొదుపు పథకాలే. వీటిలో పోస్టాఫీసుల ద్వారా అందించే పథకాల మారుమూల గ్రామాల్లోనూ విస్తరించాయి. ప్రభుత్వ నియంత్రణ ఉండటం వీటికి ప్రధాన ఆకర్షణ. కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల పథకాల్లో అందే వడ్డీ రేట్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు ప్రతిపాదించింది. ఏప్రిల్1, 2016 నుంచి అమల్లోకి రానున్న మార్పులేమిటి? వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది?
చిన్న మొత్తాల్లో పొదుపు చేయడానికీ, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టడానికీ, పన్ను ఆదా కోసం.. చాలామంది ప్రజా భవిష్య నిధి, జాతీయ పొదుపు పత్రాలు, సుకన్య సమృద్ధి యోజన, పెద్దల పొదుపు పథకం తదితర పథకాలను ఎంచుకుంటారు. తగ్గుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో వీటిపై వచ్చే రాబడిపైనా కొంత కోత పడింది.
సమీక్ష.. మూడు నెలలకోసారి
ఇప్పటివరకూ పొదుపు పథకాలపై వడ్డీని ఏడాదికోసారి నిర్ణయించేవారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక నుంచి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సమీక్షించాలని నిర్ణయించారు. ఇది 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆర్థిక వ్యవస్థలో ఉన్న వడ్డీ రేట్లకు సమానంగా చేయడమే ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశమని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఒకసారి వడ్డీ రేట్లను నిర్ణయించిన తర్వాత వడ్డీ రేట్లు పెరిగినా.. తగ్గినా పథకాలపై ప్రభావం ఉండేది కాదు. కొత్త సమీక్షా విధానంతో వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారేందుకు అవకాశం ఉంది. (పట్టిక చూడండి)
ప్రామాణిక రేటు ఆధారంగా..
జాతీయ పొదుపు పథకాల వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ప్రామాణికంగా ఆయా పథకాలకు సమాన కాలవ్యవధి కల్గిన ప్రభుత్వ బాండ్ల రాబడి శాతాన్ని పరిగణనలోనికి తీసుకొని, దానికి కాస్త అదనంగా చెల్లిస్తారు.
* ఇప్పటివరకూ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్డిపాజిట్లు, 5 ఏళ్ల రికరింగ్డిపాజిట్లపై ప్రామాణిక రేటుకన్నా 0.25% అధికంగా చెల్లించేవారు. దీన్ని ఇక నుంచి ప్రామాణిక వడ్డీ రేట్లకు సమానంగా చెల్లిస్తారు.
* ఐదేళ్ల టర్మ్డిపాజిట్లు, జాతీయ పొదుపు పత్రాలు, ప్రజా భవిష్య నిధి, నెలసరి ఆదాయ పథకాలపై ప్రామాణిక రేటుకన్నా 0.25% అధికంగా చెల్లించేవారు. దీన్ని యథాతథంగా ఉంచారు.
* సంక్షేమ పథకాల జాబితాలోకి వచ్చే.. సుకన్య సమృద్ధి యోజనపై ప్రామాణిక వడ్డీ రేటుకన్నా 0.75%, పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకంపై 1% మేరకు అధికంగా వడ్డీని చెల్లిస్తారు.
ప్రభావం ఏమిటి?
* పొదుపు ఖాతాదార్లకు వర్తించే వడ్డీ రేటులో ఎలాంటి మార్పూ లేదు.
* టర్మ్ డిపాజిట్లు, నెలసరి ఆదాయ పథకాలు, జాతీయ పొదుపు పత్రాలు, పెద్దల పొదుపు పథకం, కిసాన్వికాస పత్రాలలో మదుపు చేసినప్పుడు వర్తించే వడ్డీ రేటే.. పూర్తి వ్యవధిపాటు చెల్లిస్తారు. కాబట్టి, ఇప్పటికే పథకాల్లో పొదుపు చేసిన వారిపై తాజా మార్పుల ప్రభావం ఏమీ ఉండదు.
* రికరింగ్ డిపాజిట్లు, ప్రజా భవిష్య నిధి, సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఏప్రిల్1, 2016 నుంచి కొత్త వడ్డీ రేట్లు, కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
కోత ఎందుకు?
వడ్డీ రేటును తగ్గించడం అంటే.. చిన్న మదుపరులు, స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేసే వారికి ఆందోళన కల్గించే విషయమే. అయితే, వడ్డీ రేట్లను తగ్గిచండం వెనుక రకరకాల కారణాలు ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. గత కొన్నాళ్లుగా రిజర్వు బ్యాంకు 1.25% వరకూ వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. దాదాపు అన్ని బ్యాంకులూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 7.5%-8.00% మధ్యనే అందిస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాలు వీటికి భిన్నంగా ఉండటం సాధ్యం కాదు. ఆర్థిక వ్యవస్థలో సమానత్వం తీసుకురావడానికి అనివార్య పరిస్థితుల్లో వడ్డీ రేట్లను తగ్గించారని అనుకోవచ్చు.
* వడ్డీ రేట్లను పరిశీలించేప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం.. వాస్తవ రాబడి ఎంత ఉంది అనేది.. ఉదాహరణకు ఒక పెట్టుబడి పథకం 9శాతం రాబడిని అందిస్తుందనుకుందాం. ద్రవ్యోల్బణం 7శాతం ఉంది. అప్పుడు మనకు అందే వాస్తవ రాబడి 2శాతమే. ఒకవేళ వడ్డీ రేటు 8శాతం, ద్రవ్యోల్బణం 5% ఉంటే.. వాస్తవ రాబడి 3శాతంగా పరిగణించాలి. అంటే, ద్రవ్యోల్బణానికి మించి ఎంత అధిక రాబడి వస్తే... పొదుపు చేసే వారికి అంత లాభం అన్నమాట.
* గత కొన్నేళ్లుగా జాతీయ పొదుపు పథకాలు అధిక వడ్డీ రేటునే చెల్లించాయి. అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగానే ఉంది. అంటే, వాస్తవంగా చూసినప్పుడు అవి ప్రతికూల రాబడినే అందించాయని అనుకోవచ్చు. ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో సీపీఐ ద్రవ్యోల్బణం 5.18%గా ఉంది. ఇది మరింత తగ్గే సూచనలు ఉన్నాయని అంచనా.
* నేపథ్యంలో ప్రస్తుతం సవరించిన వడ్డీ రేట్ల ద్వారా అందే వాస్తవ రాబడి ఆకర్షణీయంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇతర డెట్పథకాలతో పోలిస్త వీటిలో నష్టభయమూ తక్కువే. ప్రభుత్వ హామీ ఉండటం కలిసొచ్చే అంశం. కాబట్టి, సురక్షితమైన పథకాలకు మీ పెట్టుబడుల్లో స్థానం కల్పించడం ఎప్పుడూ మంచిదే.
- బద్వేలు శరణ్యా రెడ్డి, సీఎఫ్(ఇక్ఫాయ్‌), సీఎఫ్పీ

No comments:

Post a Comment