Sunday, December 27, 2015

గ్రామీణ పోస్టాఫీసులకు డిజిటల్‌ అనుసంధానత

దేశంలోని గ్రామీణ తపాలా కార్యాలయాలన్నింటికీ దశలవారీగా డిజిటల్‌ అనుసంధానత కల్పించే పథకాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద గ్రామీణ పోస్టాఫీసుల పోస్ట్‌మాస్టర్లకు- చేతిలో ఇమిడిపోయేలా, ఆధార్‌ ఆధారిత పరికరాలను ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అందజేస్తారు. అన్ని లావాదేవీల డిజిటలీకరణకు ఇవి ఉపయోగపడతాయి. పథకం కింద రెండోదశలో 12 వేల తపాలా కార్యాలయాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తారు. పొదుపు ఖాతాలున్నవారు నగదు లావాదేవీలు నిర్వర్తించుకునేందుకు 1010 పోస్టాఫీస్లుల్లో ఏటీఏంలు నెలకొల్పుతారు. 2017 మార్చిలోగా దాదాపు అన్ని గ్రామీణ తపాలా కార్యాలయాలకూ ఆధార్‌ ఆధారిత పరికరాలు అందుతాయని అధికార వర్గాలు తెలిపాయి. స్పీడ్‌పోస్టు, మనీయార్డర్‌, తపాలాబిళ్లల విక్రయం వంటి అన్నిరకాల లావాదేవీలూ దీని ద్వారానే జరుగుతాయని వివరించాయి. ఖాతాదారునికి ఎలాంటి సందేహం అవసరం లేనిరీతిలో ఈ బుల్లియంత్రాలే కాయితం రసీదుల్ని అక్కడికక్కడ జారీ చేస్తాయని చెప్పాయి. ఇ-కామర్స్‌ కంపెనీలు తమ వాణిజ్యాన్ని గ్రామీణ భారతానికి చేరువ చేయడానికి ఈ యంత్రాలను వినియోగించుకునేందుకు వీలుగా వాణిజ్య మంత్రిత్వశాఖతో కమ్యూనికేషన్ల శాఖ సంప్రదింపులు జరుపుతోందని వివరించాయి.
గ్రామీణ భారత వినియోగదారులకు వస్తువు అందడానికి ముందే తమ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అయ్యేలా చూడాలని ఇ-కామర్స్‌ కంపెనీలు ఇప్పటికే వాణిజ్య మంత్రిత్వశాఖను కోరాయి. ఇ-కామర్స్‌ కోసం దేశంలో 56 చోట్ల సమీకృత పార్శిల్‌ కేంద్రాలను తపాలా శాఖ నెలకొల్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రూ.980 కోట్ల ఆదాయాన్ని వీటిద్వారా తపాలాశాఖ ఆర్జించింది. దీనిని రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటే గ్రామీణ భారతానికి డిజిటల్‌ అనుసంధానత అవసరమని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Source: http://www.eenadu.net 

No comments:

Post a Comment